21, సెప్టెంబర్ 2023, గురువారం

శివమానసపూజ

 శ్రీశంకరాచార్య విరచిత  శివమానసపూజ

            ఆంధ్ర పద్యానుసరణ


నవరత్న ఖచితమౌ నవ్యాసనంబును

        మహిత హిమజలమ్ము మజ్జనముకు

దేదీప్యమానమౌ దివ్యాంబరంబులు 

         భూతితో విలసిల్లు భూషణములు

సకలాంగములకెల్ల చందన చర్చయున్ 

         మేలైన సౌగంధ మృగమదమ్ము

జాజి బిల్వ దళాలు చంపక పుష్పముల్

         దీప నైవేద్యముల్ దివ్య ముగను

హృదయపూర్వక భక్తితో నిచ్చు చుంటి

స్వీకరించుము శంకరా ! చేతు నతులు

ముక్తి నొనగూర్చుమయ్య యో భక్తవరద!

పార్వతీనాథ !పశుపతే ! పాహి ! పాహి!         01

            

కాంచన బహురత్నఖచితమౌ పాత్రల

        పరమాన్న యాజ్యపు పాయసములు

పంచ విధమ్ములౌ పలుభక్ష్య తతితోడ

        పయయుక్త దధికృత పాకములను

భర్మ్యంపు పాత్రల పరిపూరితంబైన

        పలు స్వాధు శర్కర పానకములు

సంచిత శాకముల్ సత్ఫల వీడ్యమున్ 

        రస యుక్త శ్రేష్ఠమౌ రసనములను

అంచితంబైన భావాన యాత్మ సాక్షి

యర్పణము చేయు చుంటిని యభవ !నీకు

మానసంబున నిప్పుడు మధురముగను

పార్వతీనాథ !పశుపతే ! పాహి ! పాహి !       02

       

ఛత్ర చామరదోయి సరితాళవృంతముల్ 

        దర్శనయుక్తమౌ  దర్పణమును 

వీణా మృదంగాల విభవ నాట్యమ్ములన్ 

       శ్రావ్య గానమ్ముల భవ్య స్తుతుల

మక్కువ తోడ నా మానసంబందున

       వరలు భక్తియుక్త వందనములు

పెక్కగు పూజాళి ప్రేమతో నర్పింతు 

       దిక్కు నీవే స్వామి! దీనబంధు!

పరవశంబున నే చేయు భక్తి పూజ

లందు కొని ముక్తి నీవయ్య యిందుమౌళి !

నిరతమును నిన్నె నమ్మితి న్నీలకంఠ !

పార్వతీనాథ !పశుపతే! పాహి !పాహి !       03


ఆత్మయే నీవయ్య  నగజయే నా మతి

         ప్రమథాళి ప్రాణముల్  భసితదేహ !

నిత్యమ్ము నిద్దురే  నిత్యసమాధి ఔ

         దేహమే గేహమ్ము దివ్యతేజ !

చరణాల చలనమే యరయ ప్రదక్షిణ

         పలికెడి వాక్కులే భవ్య నుతులు 

యెయ్యవి కర్మంబు లెపుడాచరింతునో

        నయ్యవి నీ సేవె ననయ మెంచ

సర్వ వాక్కాయ కర్మలు సర్పభూష !

నీకె యర్పింతు మనసార  నిచ్చలందు 

కరుణ చూపుము పరమేశ ! కామితార్థ !

పార్వతీనాథ ! పశుపతే ! పాహి ! పాహి !   04


కర చరణములతో కర్ణ నేత్రాలతో

         భాషణమ్ములతోడ పనులతోడ

నిరతమ్ము మదియందు నే నాచరించెడి

         కడు విధమ్ములు యైన  కర్మ లందు

సరియును సరికాని సర్వమౌ చర్యల

        క్షమియించి కావుము స్వాంత మందు

నజ్ఞాన జ్ఞానాల నాచరించిన యట్టి

        చర్యల మన్నించు చారురూప !

నిన్నె నమ్మితి నిరతమ్ము నీలకంఠ !

కాచి బ్రోచుము నన్ను యో కామితార్థ !

భక్తపాలన శంకరా !భవ విదూర !

పార్వతీనాథ !పశుపతే ! పాహి ! పాహి !      05

19, సెప్టెంబర్ 2023, మంగళవారం

గాయత్రిమాత స్తుతి

       గాయత్రీమాత స్తుతి

ముక్తా విద్రుమ హేమ నీలధవళచ్ఛాయై

        ర్ముఖై స్త్రీక్ష ణైః

యుక్తాం ఇన్దునిబద్ధ రత్నమకుటాం

        తత్త్వార్థ వర్ణాత్మికామ్ ౹

గాయత్రీం వరదాభ యాంకుశ కశా

        శ్శుభ్రం కపాలం గదాం

శంఖం చక్ర  మదారవింద యుగళం

         హస్తైః  ర్వహంతీం భజే ౹



సీ.  ముత్య విద్రుమ హేమ  యత్యంత సిత నీల  

               పంచముఖంబులు పరిఢవిల్ల,

     శిఖ యందు విధురేఖ చెలువార గల్గియు,

               ఘనరత్నమకుటంబు కాంతులీన,

     తత్త్వార్థ వర్ణముల్ , త్రయలోచనంబులు 

               ఘనవిశిష్టత తోడ కల్గియుండ,

     వరదాభయములను యిరుదివ్య ఘనముద్ర ,

               లరవింద యుగళంబు, నంకుశంబు, 

తే. శంఖ, చక్ర , కశా, గదా, సహిత యగుచు 

     శుభ్రమైన కపాల, సంశోభ నున్న 

     మాత 'గాయత్రి' నెన్నుచు మదిని నేను

     భజనఁ జేసెద నత్యంత భక్తి తోడ.

విఘ్నేశ్వర స్తుతి

 విఘ్నేశ్వర స్తుతి 


తెలి వలువలు శశి వర్ణము 

నలు భుజములు విష్ణుతత్వ నాయకుడయ్యున్ 

లలి శాంత వదన మొప్పెడు 

నిలవేల్పుని శ్రీగణేశు నెపుడు భజింతున్


అగజ ముఖసరోరుహమున కర్కుడయ్యు

గజముఖుం డౌట శాంతితో కానిపించు 

భక్త  జనులకు నిరతమ్ము ప్రాపు నున్న 

ఏక దంతుండు స్వామికి మోకరిలుదు


చిన్ని కండ్లు పెద్ద బొజ్జ చిద్విలాస ముద్రతో 

చెన్ను మీర దంతిమోము చేటచెవుల తోడ తా 

పన్నగమ్మెజంద్యముగను పైనదాల్చియొప్పియున్

సన్నుతాంగుడౌ గణేశు సతము గొల్తు భక్తితో