26, అక్టోబర్ 2023, గురువారం

" దేహ, ఆత్మ స్వరూపము "

 "దేహ ఆత్మ స్వరూపము" -ఆముక్తమాల్యద

సీ. అనయంబు తనువుచే ననుభవింపబడెడి

              భార్య, గృహాదులు, పరికరములు,

     వపువు సంబంధిగా వచ్చు చుండును గాన 

             నరయంగ నయ్యవి యాత్మ కావు 

     పొందబడుచునున్న పుత్రపౌత్రాదులు 

              కల్గు మేనున కాన  కాదె యాత్మ 

     మృత్యువున్ పొందెడి మేనుతో గల్గిన

             సుతులు నావారంచు చూడ తగదు

     ఎపుడాత్మ వేఱను యెఱుక తా పొందునో 

            యాత్మకు వాసన లంటకుండు

     తనువును నాత్మగా తలచినతోడనే

           యఖిల భోగమ్ములు నంటు తనకు 

తే. గట్టిగా పూని కట్టిన మట్టి యిల్లు

     నలుకుమట్టిన  జలమున నవని నిల్చు

     అట్లు భౌతిక భోగాశనాది తోడ 

     నంగములు నిల్చుచుండును నరసి జూడ

     ఇందులో నాత్మభోగమ్ము నెచట నుండు ?   


సరళ పద్యానుసరణ :

✍️గోపాలుని మధుసూదన రావు 🙏

20, అక్టోబర్ 2023, శుక్రవారం

మధుర సూక్తి

              మధుర సూక్తి 


కలుగరే రాజన్యు లిలను నేలగ లేదె 

         ఘనతతో తిరుగరే  గర్వమునను !

వారేరి ! యిప్పుడీ వసుధలో నున్నారె !

         సిరి తోడ దివముకు  చేరి నారె!

నుర్వి పై వారల కున్నట్టి పేరది 

         నిలిచినే యశముతో నిఖిలమందు 

శిబిచక్రవర్త్యాది శ్రేష్టులౌ రాజులు 

         కోర్కెలన్ దీర్చరే కూర్మి జనుల

వారలను విస్మరించిరె వసుధ యందు  !

ఎన్ని వర్షంబు లేలిన న్నేమి ఫలము

యిహ పరమ్ములు లేకను నహము తోడ

బ్రతుకు నందున యశమును బడయకునికి.



✍️గోపాలుని మధుసూదన రావు 🙏


వినయాంజలి

                 

          🌹వినయాంజలి 🌹

నిరతమీ సంసార  నీరధిన్ బడి యీది
           వపువు పై యాశను వదల లేక
తేలుచున్ మునుగుచున్ దీరమ్ము కనలేక
           ప్రాణ ప్రయాణముల్ బ్రతుకు నందు
శతసంఖ్య లోర్చితిన్ సర్వేశ్వరా ! యీశ !
          చాలు మిథ్యాసౌఖ్య సతత భ్రమలు
నిత్య సౌఖ్యమ్మది నెనరుతో  నా కిమ్ము
          రక్షించి నిరతమ్ము రాగమునను
బ్రతుకు భ్రమలను పోగొట్టి సతము నాకు
ముక్తి నొసగుమ దివ్యానురక్తి చూపి
పరమపావన శంకరా ! భసిత దేహ !
పార్వతీనాథ ! వేడద పాహి ! పాహి !


✍️గోపాలుని మధుసూదన రావు 🙏


సుభాషితము

               సుభాషితము

    శ్లో:-ఋణానుబంధ రూపేణ 

          పశు పత్ని సుతాలయా: 

          ఋణ క్షయే క్షయం యాంతి

          తత్ర  కా పరిదేవనా ? 


చ. వసుధ ఋణానుబంధమున వర్తిలు పుత్ర, కళత్ర, వాసముల్, 

పశువులు, మానవాళికిని పాయక యుండుగ నెల్ల వేళలన్ ,

వసుధ ఋణంబు దీరగను వాటికవే మరి వీడు చుండ , యా 

మసలిన బంధమున్ దలచి మానవు  డేలను చింత చెందగన్ ?


✍️గోపాలుని మధుసూదన రావు 🙏

19, అక్టోబర్ 2023, గురువారం

నిర్వాణ షట్కము


        🌹నిర్వాణ షట్కము🌹


01

మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం

న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే

న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః

    చిదానందరూపః శివోహం శివోహం

    చిదానందరూపః శివోహం శివోహం


ఘనత గల్గిన చిత్తమ్ము  మనసు కాను 

అరయ బుద్ధిని గాను నే నహము కాను 

చెవులు కన్నులు నాసిక  జిహ్వ  కాను

అవని వ్యో మాగ్ని  వాయువు నరయ కాను 

    శివ  చిదానంద రూపమౌ శివుడ నేను 

    శివ  చిదానంద రూపమౌ శివుడ నేను    01


02                                                                 

న చ ప్రాణ సంజ్ఞో న వై పంచవాయుః

న వా సప్తధాతుః న వా పంచకోశః

న వాక్పాణిపాదం న చోపస్థపాయుః

           చిదానందరూపః శివోహం శివోహం

           చిదానందరూపః శివోహం శివోహం


ప్రాణ  సంజ్ఞను  భావింప కాను నేను 

పంచ వాయువు లరయంగ నెంచ కాను

రక్త రస మాంస  మేదాస్థి  యుక్త మైన 

సప్తధాతువులను గాను  సంభ్రమముగ

పంచకోశాధివాస సంపత్తి గాను 

కర చరణ మాట లేమియు న్నరయ కాను 

     శివ  చిదానంద రూపమౌ శివుడ నేను 

     శివ  చిదానంద రూపమౌ శివుడ నేను  02 


03                                                                 

న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ

మదో నైవ మే నైవ మాత్సర్యభావః

న ధర్మో న చార్థో న కామో న మోక్షః

    చిదానందరూపః శివోహం శివోహం

    చిదానందరూపః శివోహం శివోహం


అరయ ద్వేషానురాగ  విహారి గాను 

మోహలోభంబులును కూడ మొదలు లేవు 

మరియు ధర్మార్థ  కామముల్ మహిత ముక్తి

యేవియును లేవు నాకు నే నేమి కాను

      శివ  చిదానంద రూపమౌ శివుడ నేను 

     శివ  చిదానంద రూపమౌ శివుడ నేను   03


04                                                                 

న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం

న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞా

అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా

            చిదానందరూపః శివోహం శివోహం

            చిదానందరూపః శివోహం శివోహం


ఎన్నగా పుణ్య పాపంబు లేవి లేవు 

సుఖము దుఃఖము లనునవి చూడ లేవు 

తీర్థ మఖములు మంత్రముల్ తెలియ లేవు

అనుభవమ్మది  లేదు నా కనుభవించ

     శివ  చిదానంద రూపమౌ శివుడ నేను 

     శివ  చిదానంద రూపమౌ శివుడ నేను   04    


05                                                                 

న మే మృత్యుశంకా న మే జాతి భేదః

పితా నైవ మే నైవ మాతా న జన్మః

న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యం

           చిదానందరూపః శివోహం శివోహం

           చిదానందరూపః శివోహం శివోహం


చనెడుభయమది  లేదింక  జాతిలేదు 

జనని జనకులు మరి లేరు జన్మలేదు

కాను  బంధువు  నరయంగ  కాను సఖుడ

కాను నే శిష్యుడను మరి  కాను గురువు

     శివ  చిదానంద రూపమౌ శివుడ నేను 

     శివ  చిదానంద రూపమౌ శివుడ నేను   05


 06                                                             

అహం నిర్వికల్పో నిరాకార రూపః

విభుర్వ్యాప్య సర్వత్ర సర్వేంద్రియాణాం

సదామే సమత్వం న ముక్తిర్న బంధః

           చిదానందరూపః శివోహం శివోహం

           చిదానందరూపః శివోహం శివోహం


లేదు  రూపమ్ము చూడగన్  లేదు మార్పు

ఇల ప్రదేశమ్ము లందు సర్వేంద్రియముల

వ్యాప్తి చెందియు ననయమ్ము వరలు చుందు,

నరయ సమదృష్టి నుందు నే నన్నిటందు 

ముక్తి బంధమ్ము లవిలేవు రక్తి లేదు

      శివ  చిదానంద రూపమౌ శివుడ నేను 

     శివ  చిదానంద రూపమౌ శివుడ నేను   06



అనువాద రచన

✍️గోపాలుని మధుసూదన రావు🙏 






   

    






సుభాషితము

              సుభాషితము

సీ. సగరు పురూరవు  సత్యహరిశ్చంద్రు  

            నర్జును పురుకుత్సు నధిపునలుని

    గయ భగీరథులను ఘనుడుసుహోత్రుని

            భరత దిలీపులన్ పరశురాము

    శ్రీరాము శశిబిందు శిబిని మరుత్తుని

            రాజుయయాతిని రంతిదేవు

    నంబరీషు పృథుని నధిపుమాంధాతను

           వీడెనే కాలమ్ము  వెంట గొనక 

తే. కాన మృత్యువు కబళించు ఘనుల నైన, 

     తలచగా కాలమొక్కటే యిలను నున్న

     మాన్యులకు మరి సకల సామాన్యులకును ,

     కాలమును దాట జీవికి వీలు కాదు.             

 

ఆ. మెఱుపుతీగ వంటి మేదినీసుఖముల

     తగులు కొనియు నెపుడు తల్లడిలుచు, 

     నితర విధులు వీడి యింద్రియాలోలతన్ 

     కాల మెపుడు నరుడు గడుప రాదు .           


✍️గోపాలుని మధుసూదన రావు 🙏

18, అక్టోబర్ 2023, బుధవారం

శ్రీరామచంద్రుని శివుధనుర్భంగము

 🌹శ్రీరామచంద్రుని శివుధనుర్భంగము🌹

సీ. శ్రీరామచంద్రుండు చేబూని ధనువున 

               కల్లియన్ దగిలించ  'పెళ్లు' మనియె

     ఘన కార్ముకంబును తన చేత ధరియించ

               గంటలు కదిలియు 'ఘల్లు' మనియె

     విన పెనుసవ్వడిన్ వీనులున్  కదలంగ

               జనుల డెందంబులు 'ఝల్లు' మనియె 

     విఱిగిన వెనువెంట విపరీతముగ నున్న                  

              భీతితో గుండె  'గుభిల్లు' మనియె

తే. ఒక్క క్షణమందు నచ్చట మిక్కుటముగ

     'పెళ్లు'  'ఘల్ల'ని   'ఝల్లు'  'గుభిల్లు' మనియు

     సవ్వడులు గల్గె వెనువెంట సంభ్రమమున 

     వీరు డా రామచంద్రుండు విఱువ విల్లు.       


✍️గోపాలుని మధుసూదన రావు🙏