16, అక్టోబర్ 2023, సోమవారం

భక్త్యాంజలి

 పరమశివునకు  భక్త్యాంజలి 

ఆత్మయే నీవయ్య  నగజయే నా మతి

         ప్రమథాళి ప్రాణముల్  భసితదేహ !

నిత్యమ్ము నిద్దుర  నిత్యసమాధియే

         దేహమే గేహమ్ము దివ్యతేజ !

చరణాల చలనమే యరయ ప్రదక్షిణ

         పలికెడి వాక్కులే భవ్య నుతులు 

ఎయ్యవి కర్మంబు లెపుడాచరింతునో

        యయ్యవి నీ సేవె ననయ మెంచ

సర్వ వాక్కాయ కర్మలు సర్పభూష !

నీకె యర్పింతు మనసార  నిచ్చలందు 

కరుణ చూపుము పరమేశ ! కామితార్థ !

పార్వతీనాథ ! పశుపతే ! పాహి ! పాహి !


కర చరణములతో కర్ణ నేత్రాలతో

         భాషణమ్ములతోడ పనులతోడ

నిరతమ్ము మదియందు నే నాచరించెడి

         కడు విధమ్ములు యైన  కర్మ లందు

సరియును సరికాని సర్వమౌ చర్యల

        క్షమియించి కావుము స్వాంత మందు

జ్ఞాన మజ్ఞానాల నాచరించిన యట్టి

        చర్యల మన్నించు చారురూప !

నిన్నె నమ్మితి నిరతమ్ము నీలకంఠ !

కాచి ప్రోవుము నన్ను నో కామితార్థ !

భక్తపాలన శంకరా !భవ విదూర:!

పార్వతీనాథ !పశుపతే ! పాహి ! పాహి !   


✍️గోపాలుని మధుసూదన రావు 🙏


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి