2, అక్టోబర్ 2023, సోమవారం

శ్రీ మదాంధ్ర మహాభారతము



         శ్రీ మదాంధ్ర మహా భారతము 



ఘనుడౌ నన్నయభట్టు తా గరిమతో గావించె నాంధ్రంబునన్

మునిరాట్ వ్యాసుని  ప్రోక్తమై బుధ జనామోదంబునైయున్న  శ్రీ

ఘనమౌ భారతసంహితన్ , జనులు భాగ్యంబంచు శ్లాఘించగా , 

వినుతించన్ కవివర్యులంద రిలలో వేదంబుగా నెంచియున్.               

       

ఇన్నూరేండ్లు గతించిపోవ పిదప న్నీనేలపై భవ్యమౌ 

పెన్నా తీరమునన్ జనించి ధృతితో  పెంపొంది తిక్కన్న ,యా

పన్నుండైన హరీశునిన్ దలచుచున పర్వంబులన్ సర్వము

న్నెన్నంగన్ పరిపూర్తి జేసె కవితన్  వేనోళ్ళ కీర్తించగన్                  


ఒక శత వత్సరంబులకు నుర్విని నెఱ్ఱన జన్మ మొందియున్

సకలము నందునన్ మిగిలి సాగకనున్న నరణ్యభాగమున్  

సుకవిత తోడ గూర్చియును శోభను దెచ్చెను , భారతాఖ్య మీ 

రకముగ పూర్తి నొందియును  రాగము తోడుత  దక్కె జాతికిన్          


వాగనుశాసనుండు కవి వంద్యుడుతిక్కన  యెఱ్ఱనార్యుడున్

న్నాగమ సారమైన తొలి యాంధ్రకవిత్వము  సృష్టిజేసియున్

రాజితమైన భారతము  రంజిల నిచ్చిరి యాంధ్రజాతికిన్       

సాగగ మూడు వందలగ  సాలులు దక్కెను గ్రంథ మీవిధిన్

   


నన్నయభట్టుతో నయముగా మొదలయ్యు 

               నాంధ్ర భారతకావ్య మవని సాగె 

యిరు పర్వ భాగమే పరిపూర్ణ మయ్యును 

                నంతలో యా కావ్య మాగిపోయె 

సాగగ నిన్నూఱు సంవత్సరములకు 

                పుణ్యుడౌ తిక్కన పుడమి పుట్టి 

పర్వంబు నాల్గుతో ప్రారంభ మొనరించి 

                 పరిపూర్తి గావించె పదియునైదు 

పిదపను నూఱేండ్లు సదమల కావ్యమ్ము          

                నుండెను కొరతతో నుర్వి పైన 

నన్నయ్య వీడిన నవకంపు భాగమ్ము 

                 పూరించె నెఱ్ఱన పూర్తిగాను 

భవ్యమైనట్టి శ్రీయాంధ్ర భారతంబు 

గడచి మున్నూఱు వత్సర కాల మరయ 

కవులు ముగ్గురు రచియింప ఘనత కెక్కి 

తెలుగు జాతికి లభియించె దివ్యముగను 


రచన

గోపాలుని మధుసూదన రావు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి